Sunday, August 25, 2013

" ఓ......... సుకుమారా....... నను........ జేర........ రావోయీ".......(చిత్రం "భార్యాభర్తలు").

ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మించిన చిత్రం "భార్యాభర్తలు".  అనుమోలు వెంకట సుబ్బారావు  నిర్మాత,  కి. ప్రత్యేగాత్మ దర్శకుడు.  సంగీతం శ్రీ  సాలూరు రాజేశ్వర రావు.  పాటలన్నీ బాగున్నాయి.  ముఖ్యంగా "జోరుగా హుషారుగా, ఏమని పాడేదనో ఈ వేళా, మధురం మధురం  ఈ సమయం, చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి, ఓ సుకుమార"  మొదలగునవి. 52 సంవత్సరాల క్రితం నాటి ఆ పాటలు,  నేటికి సజీవంగా ఉన్నాయంటే, అవి ఎంతలా శ్రోతల హృదయాలలో నిలిచి పోయాయో. ఆ పాటలు ఎంతో మధురమో అందఱికి తెలుసు.  ఘంటసాల మాస్టారు, సుశీల పాడిన " ఓ.... సుకుమారా... నను..... జేర...... రావోయీ".............. యుగళ  గీతం మంచి మెలోడి పాట.   ఇది డ్రీం సీక్వెన్స్ పాట. ఈ చిత్రం 1961 లో విడుదలైంది. 









  

Tuesday, August 20, 2013

" ఎవరి కోసం ...... ఎవరి కోసం..... ఈ ప్రేమమందిరం, ఈ శూన్యనందనం" ( 3 బాషలలో)


Prem Nagar.jpg

సురేష్ ప్రొడక్షన్స్ వారి ప్రతిష్టాత్మిక చిత్రం "ప్రేమనగర్".  ఈ చిత్రం 1971 లో విడుదలై గొప్ప విజయం సాదించిన చిత్రం.  చిత్ర దర్శకుడు శ్రీ K S ప్రకాష్ రావు, సంగీతం శ్రీ K V మహదేవన్. అన్నీ పాటలు మధురాతి మధురంగా ఉన్నాయ్. ఘంటసాల, సుశీల పాడిన  పాటలు, చిత్ర విజయానికి ఎంతో తోడ్పడ్డాయి అనడం అతిశయోక్తి కాదు. అక్కినేని (కళ్యాణ్), వాణిశ్రీ (లత)   నటన అమోఘం.                   
ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు పాడిన (రచన: శ్రీ ఆచార్య ఆత్రేయ)
" ఎవరి కోసం ......  ఎవరి కోసం..... ఈ ప్రేమమందిరం, ఈ శూన్యనందనం"
చాలా భావోద్వేవంగా సాగిన పాట.

Vasantha Maligai.jpg

ప్రేమనగర్ చిత్రాన్ని తమిళం లో "వసంత మాలిగై" పేరుతో   తీసారు. ఈ చిత్రాన్ని కూడా శ్రీ రామానాయుడు నిర్మించారు. దర్సకత్వం శ్రీ కే యస్ ప్రకాష్ రావు, సంగీతం శ్రీ కే వీ మహదేవన్, నాయిక వాణిశ్రీ(లత)  కథానాయకుడు   శివాజీ గణేషన్ (ఆనంద్).   ఘంటసాల మాస్టారు తెలుగులో  పాడిన  పాట " ఎవరికొసం ...  ఎవరికోసం .. పాటను  తమిళంలో    "యారుకాగ .... యారుకాగ"    అని  సౌందరరాజన్ పాడారు. రచన: కన్నదాసన్. 
 ఈ చిత్రం 1972 లో విడుదలై అఖండ విజయం సాదించింది.

Prem Nagar 1974 Film Poster.JPG

శ్రీ రామానాయుడు గారే ఈ చిత్రాన్ని హిందీ లో   కూడా "ప్రేమనగర్" పేరుతోనే కే యస్ ప్రకాష్ రావు దర్సకత్వం  లోనే   తీసారు.  సంగీతం శ్రీ యస్ డీ బర్మన్ సమకూర్చారు.  ఈ చిత్రం 1974 లో విడుదలై విజయం సాదించింది. నాయికా నాయకులు  గా హేమామాలిని (లత),  రాజేష్ ఖన్నా(కరణ్ సింగ్) నటించారు. పై సన్నివేశ పాటను  శ్రీ "కిశోరే కుమార్" పాడారు. ఆ పాట 
"జా .. జా .. జా ముజ్హే అబ్ నా యాద్ ఆ" ......  ఈ గీతాన్ని ఆనంద్ బక్షి వ్రాసారు.

హిందీ లో  ఇదే పేరుతో (ప్రేమ నగర్)   1940 లో ఒక చిత్రం విడుదలైంది. చిత్ర దర్శకుడు మోహన్ దయారాం భావనాని,  రామానంద్, బిమ్లా కుమారి, హుస్ను భాను నటించారు.    కాని, దానికి, దీనికి ఎలాంటి సంబంధం లేదు.

ఒకే చిత్రాన్ని, ఒక నిర్మాత (రామానాయుడు) ఒకే దర్శకునితో  (కే యస్ ప్రకాష్ రావు) 3 బాషలలో తీయడం చాలా అరుదైన విషయం. పైగా 3 బాషలలోను విజయం సాధించి, నిర్మాతకు ఎనలేని కీర్తిని, ధనాన్ని ఆర్జించింది. మూడు చిత్రాలలోనూ, నాయిక పేరు "లత", నాయకుని పేరు మాత్రం మార్చారు.  .

ఇక పాటల విషయానికి వస్తే, తెలుగు పాటే అత్త్యుత్తమం.  ఘంటసాల గళం నుండి జారు వారిన  ఈ పాట,  మిగిలిన బాష పాటలకన్నా ఎంతో  గొప్పగా ఉంది,  అని నిస్సంకోచంగా చెప్పవచ్చు.  మీరు కూడా ఆ 3 పాటలు విని, మీ నిర్ణయాన్ని తెలియచేయండి.

పాటలన్నీ యు ట్యూబ్ ద్వారా సేకరించడం జరిగిన్ది.  వారికి నా ధన్యవాదాలు.



 
  
 

Wednesday, August 14, 2013

"జన్మ మెత్తితిరా అనుభవించితిరా" (ఇదే పాట 3 బాషలలో )

రాజ్య లక్ష్మి ప్రొడక్షన్స్, శ్రీ V మధుసూదన్ రావు దర్సకత్వంలో నిర్మించిన చిత్రం "గుడిగంటలు"  1964 లో విడుదల.  ఘంటసాల మాస్టారు సంగీతం సమకూర్చారు. ఈచిత్రంలోని "జన్మ మెత్తితిరా అనుభవించితిరా"  ఒక విషాద పాట.  ఘంటసాల గారు చాలా ఆర్ద్రత తో పాడారు. శ్రీ N T రామారావు, జగ్గయ,కృష్ణకుమారి నటించారు    

గుడిగంటలు చిత్రానికి మూలం తమిళంలో వచ్చిన " ఆలయమణి", ఈ చిత్రం 1962 లో వచ్చింది. ఈ చిత్రంలో పై పాట సన్నివేశానికి, T M సౌందర్ రాజన్ పాడిన "సత్తి సత్తదడ"అనే పాట ఉంది. సంగీతం శ్రీ విశ్వనాథన్ రామమూర్తి. చిత్ర దర్శకుడు K శంకర్. శివాజీ గనేషన్, రాజేంద్రన్, సరోజా దేవి నటీ నటులు

ఇదే చిత్రాన్ని హిందీ లో "ఆద్మి" పేరుతో,  శ్రీ A  భీమ్ సింగ్ దర్సకత్వంలో తీసారు . ఇది 1968 లో వచ్చింది. ఈ చిత్రానికి సంగీతం శ్రీ నౌశాద్ సమకూర్చారు . పై సన్నివేశమ్ పాటను శ్రీ షకీల్ బదాయుని  వ్రాసారు. ఆ పాట " ఆజ్ పురాని రాహోం సే". చాల ప్రజాదరణ పొందిన పాట. దిలీప్ కుమార్,మనోజ్ కుమార్, వహీదా రెహమాన్ నటించారు. 

గుడిగంటలు, ఆలయమణి, ఆద్మి, ఒకే సినిమా 3 బాషలలో నిర్మించిన చిత్రమ్. దర్శకులు వేరు, సంగీత దర్శకులు వేరు, పాడిన  గాయకులు కూడా వేరు . 3 ప్రాంతాలకు చెందిన వారు వీరందరు.  ఒక్క తెలుగు లోనే, ఘంటసాల గారు సంగీత దర్సకత్వం తో పాటు,  పై పాటను పాడడం జరిగింది.  అది మన తెలుగు వాళ్ళ అదృష్టం.

పాటలన్నీ యు ట్యూబ్ ద్వారా సేకరించడం జరిగింది. వారికి మా కృతజ్ఞతలు


 

Tuesday, August 13, 2013

ఒకే పాట మూడు బాషల్లో: (చిత్రం జయసింహ)



N A T సంస్థ నిర్మించిన జయసింహ చిత్రం 1955 విడుదల. జానపద చిత్రాలలో మేటి చిత్రం. శ్రీ దాసరి యోగానంద్ దర్సకత్వమ్  వహించారు, సంగెతం శ్రీ T V రాజు. ఈ చిత్రాన్ని తమిళం, హిందీ బాషలలో అనువదించారు.

తెలుగు లో  రావు బాలసరస్వతి, ఘంటసాల పాడిన యుగళ గీతం 
"మదిలోనే మధుర భావం, పలికేను  మోహన రాగం"  చాలా చాలా మెలోడీ పాట. గీత రచన శ్రీ సముద్రాల. 

తమిళంలో వీరే " మలరోడుం మధుర మేవుం, మనం కానుం మోహన్ రాగం" అంటూ గానం చేసారు.  

అలాగే, హిందీ లో "మన్  బీనా మధుర్ భోలే,  మై రాగ్ ....  తు..  మేరా సరగమ్" (చిత్రం జయసింఘ్ --1959 లో విడుదల) గీత రచన: ప్రేమ్ ధవన్, సంగీతం: రమేష్ నాయుడు. గాయనీ గాయకులు: లతా మంగేష్కర్, మన్నాడే. 

ఈ మూడు బాషలలోను ఆ పాటను వినండి. పాటలు యు  ద్వారా సేకరణ. వారికి మా ధన్యవాదాలు. పాటలలోని మాధుర్యాన్ని ఆస్వాదించండి. 


 

Monday, August 12, 2013

"కన్నుల్లో మిసమిసలు కనిపించని, గుండెల్లో గుసగుసలు వినిపించని"


రేఖా & మురళి ఆర్ట్స్ బ్యానర్ పై నటుడు పద్మనాభం నిర్మించిన చిత్రం "దేవత". 1964 లో విడుదలై విజయం సాదించిన చిత్రం. కథా బలం తో పాటు., సంగీత పరంగా ఉత్తమ విలువలు కల్గిన చిత్రం. చిత్ర దర్శకుడు శ్రీ హేమాంభరధర రావు,  సంగీతం శ్రీ S P కోదండపాణి. అన్ని పాటలు చాలా చాలా బాగున్నాయి. శ్రీ వీటూరి వ్రాసిన గీతం "కన్నుల్లో మిసమిసలు కనిపించని, గుండెల్లో గుసగుసలు వినిపించని" ఒక చక్కటి యుగళ గీతం. ఘంటసాల మాస్టారు, సుశీల గారలు ఈ పాటను ఎంతో అద్భుతంగా పాడారు.  ఈ పాటలో ఘంటసాల గారు, పాట మధ్యలో పై స్వరంలో  "అణువైన వేళ .............అందాలు దాచకు"   అన్నచోట మరియు  "నా లోని ప్రేమా............మారాకు వేయని " అని అందుకోవడం, పాటకే వన్నె తెచ్చింది. ఆ పాట విందాము. పాట సహకారం T one, యు ట్యూబ్ ద్వార సేకరణ. వారికి మా కృతజ్ఞతలు.  ఈ పాటను నలుగురికి వినిపించడమే ఈ బ్లాగ్ ధేయం.


 

Saturday, August 10, 2013

" ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక" ( "ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక".)


 శ్రీమతి కోడూరి కౌసల్యా దేవి నవల " చక్రభ్రమణం" ఆధారంగా,  అన్నపూర్ణ సంస్థ, శ్రీ  ఆదుర్తి సుబ్బారావు దర్సకత్వంలో నిర్మించిన చిత్రం, 
 "డాక్టర్ చక్రవర్తి."  ఈ పేరు వినగానే మొదట గుర్తు కు  వచ్చేది  ఘంటసాల   మాస్టారు పాడిన పాట "మనసున మనసై బ్రతుకున బ్రతుకై"(   ఈ పాటను నా బ్లాగ్ లో 08-04-2012 లో ) పోస్ట్ చేశాను. చాల గొప్ప పాట, మాస్టారు కు నచ్చిన పాట గా చెప్పుతారు. 

చిత్ర ప్రారంభంలో ఘంటసాల,  సుశీల గారలు పాడిన పాట " ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక"   ఒక మంచి మెలోడీ పాట.  సాలూరు  రాజేశ్వర రావు సమకూర్చిన సంగీతం ఈ పాటకు మరింత అందాన్ని తెచ్చింది. చాల రోజుల తరువాయి కలుసుకొన్న ప్రేమికులు వాళ్ళ భావాలు ఎలా ఉంటాయో చక్కగా చెప్పిన పాట. చిత్రీకరణ కూడా బాగా ఉంది. పాటలో  చరణం "ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక". ఎంత అందంగా చెప్పారు కవి  శ్రీ ఆరుద్ర. ఆ పాట విందాము. వీడియో సహకారం తెలుగు ఒన్, యు ట్యూబ్ ద్వారా, వారికి నా ధన్యవాదాలు. 

ఆ రోజుల్లో, పాటలను మొదటి సారి చిత్రంలోనే వినే వాళ్ళం . ఆడియా కేసెట్లు, వగైరా లేని  రోజులు. కేవలం గ్రామఫోన్ రికార్డ్స్ లో విడుదల చేసినా, అందరికి అందుబాటులో ఉండేవి కావు.  విన్న పాటను  మళ్ళి  వినాలన్నా, సినిమా చూడవలసిందే.   ఈ రోజుల్లో చిత్రం విడుదల కు ముందే పాటలను విడుదల చేస్తున్నారు.  కాని పాత పాటలకు ఉన్న ఆదరణ నేటి పాటలకు లేవు.


 

Wednesday, August 7, 2013

"కోవెల ఎరుగని దేవుడు కలడని అనుకొంటినా నేను ఆ నాడు, కనుగొంటి కనుగొంటి ఈ నాడు",


D V S ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీ D V S రాజు నిర్మించిన చిత్రం 
"తిక్క శంకరయ్య",  11-10-1968  విడుదల. శ్రీ దాసరి యోగానంద్ దర్సకత్వం,  శ్రీ తోటకూర వెంకట రాజు (టీ వీ రాజు) సంగీతం.   
ఈ చిత్రంలో 7 పాటలు ఉండగా అందులో 6 పాటలు శ్రీ సి. నారాయణ రెడ్డి గారు వ్రాయగా ఒక పాటను శ్రీ కొసరాజు వ్రాసారు. దాదాపు అన్ని పాటలు బాగున్నాయి. 

ఘంటసాల మాస్టారు, సుశీల పాడిన "కోవెల ఎరుగని దేవుడు కలడని అనుకొంటినా నేను ఆ నాడు,  కనుగొంటి కనుగొంటి ఈ నాడు", చాల చక్కటి పాట.
















 

" నీలో నేనై, నాలో నీవై తీయని కలలే కందాము, ఎడ బాయని జంటగ ఉందాము"



ఘంటసాల మాస్టారు గారి సంగీత దర్సకత్వంలో ఇంకొక ఆణిముత్యం "ఆలీబాబా 40 దొంగలు". 1970 లో విడుదల.  శ్రీ B విఠలాచార్య నిర్మించి, దర్సకత్వం వహించిన చిత్రం. 

 1950 లో హిందీలో,  1956 లో తమిళంలో  విజయాలు సాదించిన చిత్రం. 
తమిళంలో  శ్రీ T R రామచంద్రన్,  మోడరన్ థియేటర్ బ్యానర్ పై  నిర్మించారు.  1956 లో విడుదలైన చిత్రాన్ని తెలుగు లో అనువదించారు. ఈ చిత్రంలో M G రామచంద్రన్, భానుమతి, P S వీరప్పన్, తంగవేలు నటించారు. 

తెలుగు లో నందమూరి తారక రామారావు, జయలలిత నటించారు. ఈ చిత్రం లో ఘంటసాల సుశీల  గారలు 
పాడిన " నీలో నేనై, నాలో నీవై,  తీయని కలలే కందాము, ఎడ బాయని జంటగ  ఉందాము"  ఒక చక్కటి పాట. ఆ పాట విందాము. వీడియో క్లిప్పింగ్ యు ట్యూబ్ సహకారంతో, వారికి ధన్యవాదాలు. 
 

 

Monday, August 5, 2013

" నీలోన నన్నే నిలిపేవు నేడు ఏ శిల్పి కల్పనవో, ఏ కవి భావనవో"


రాజ్యలక్ష్మి సంస్థ నిర్మించిన  "గుడిగంటలు" 1964 లో విడుదలై విజయం సాదించిన చిత్రం.  దర్శకుడు శ్రీ V మధుసూదన్ రావు, సంగీత సారత్యం శ్రీ ఘంటసాల మాస్టారు. దాదాపు అన్ని పాటలు ప్రజాదరణ పొందినవే. 
శ్రీ ఆత్రేయ వ్రాసిన " నీలోన నన్నే నిలిపేవు నేడు ఏ శిల్పి కల్పనవో, ఏ కవి భావనవో" మంచి  మెలోడీ పాట. ఎన్ని సార్లు విన్నా, మరీ మరీ వినాలనే కుతూహలం కలుగు తుంది. శ్రీ ఆత్రేయ గారు పాటలో నాయికను, ఎల్లోరా గుహలో శిల, నండూరి వారి ఎంకి, విశ్వనాథ వారి కిన్నెర, బాపిరాజు గారి శశికళ, కవి కాళిదాస్ శకుంతల తో  పోల్చడం, ఈ మాటలను ఘంటసాల గారి నోట వింటూ ఉంటె, చెప్పలేని హాయి. పాట ఎంత అందంగా వ్రాయబడిందో, మాస్టారు అంత అందంగాను పాడారు. 
  ఆ పాట విందాము. వీడియో సహకారం వోల్గా, యు ట్యూబ్ ద్వారా. వారికీ ధన్యవాదాలు