Sunday, April 29, 2012

కలకల విరిసి జగాలే పులకించెనే

నందమూరి తారక రామారావు, రమణమూర్తి, దేవిక నటించిన చిత్రం "శబాష్ రాముడు." ఈ చిత్రం 1959 లో విడుదలైంది. చిత్ర దర్శకుడు శ్రీ సి.యస్. రావు. సంగీత దర్శకుడు శ్రీ ఘంటసాల మాస్టారు. శ్రీ శ్రీ గారు వ్రాసిన పాట "కలకల విరిసి జగాలే పులకించెనే" యుగళ గీతాన్ని ఘంటసాల, సుశీల పాడారు. ఆ పాటని వీడియో క్లిప్పింగ్ లో చూడండి. పాటను ఆనందించండి.
చాలా అరుదుగా వినిపించే పాట కానీ మాస్టారు స్వరంలో వినిపించే మంచి పాట.


   

Thursday, April 19, 2012

జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సారం ఇంతేనయ


శ్రీ సుబ్బరామన్ గారు సంగీతం సమకూర్చిన "దేవదాసు"చిత్రంలోని అన్ని పాటలు మేలిమి ఆణిముత్యాలు. ఎన్ని సార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనే ఉంటుంది.. ఈ చిత్ర నిర్మాణ దశలో శ్రీ సుబ్బరామన్ గారు కీర్తిశేషులు కావడం దురదృష్టకరం. ఈయన  జూన్ 1952 లో తనువు చాలించారు. దేవదాసు చిత్రం 26-6-1953 లో విడుదలైంది. ఈ చిత్రం ద్వారా ఆయన శాశ్వత కీర్తి పొందారు అనడంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. అలాగే ఘంటసాల మాస్టారు మనసు పెట్టి, అనుభవించి పాడిన ఆ పాటలు నిత్య నూతనం.  శ్రీ సముద్రాల గారు, వేదాలలో సారాన్ని వడబోసి వ్రాసిన పాట "జగమే మాయ బ్రతుకే మాయ". ఈ పాటకు శ్రీ సుబ్బరామన్ గారి దగ్గర సహాయకులుగా ఉన్న శ్రీ విశ్వనాథన్, రామమూర్తి గారలు సంగీతం సమకూర్చారు.  ఘంటసాల గారు పాడిన కొన్ని వేల పాటలలో తల మానిక్యంగా నిలిచిపోయిన పాట. ఈ పాటలో దగ్గింది కూడా తనే అని చెప్పుకొన్నారు మాస్టారు. కలిమిలేములు, కష్టసుఖాలు, కావడి కుండలు, కావడి కొయ్య, కుండలు మన్ను, ఆశ, మోహం, అన్యులకే ఈ సుఖం అంకితం, భాధ, సౌఖ్యం, నిశ్చలాన్నందం, ఇలాంటి పదజాలంతో పాటకు ఊపిరి పోసారు రచయిత. ఆ పాట దృశ్య రూపంగా చూడండి. (వీడియో యూట్యూబ్ ద్వార సేకరించడమైనది)

  ఘంటసాల మాస్టారు అమెరికాలో live concert 1970 లో ఇచ్చినప్పుడు ఈ పాట పాడారు. దాని క్లిప్పింగ్ కూడా చూడండి.
 

Tuesday, April 17, 2012

"చెలియ లేదు చెలిమి లేదు,వెలుతురే లేదు ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేలే

సాంఘిక చిత్రాలలో వినోదా వారి దేవదాసు ఒక కళాఖండం. అక్కినేని అపురూప నటన, శ్రీ సుబ్బరామన్ సంగీతం, ఘంటసాల మాస్టారు పాటలు, ఈ చిత్రాన్ని మేటి చిత్రంగా చేసింది. ఈ చిత్రంలోని రెండు పాటలు "పల్లెకు పోదాం, పారును చూదాం" మరియు "కుడి ఎడమైతే పొరపాటు లేదోయి" పోస్ట్ చేశాను. వీడియో క్లిప్పింగ్ చూసారు, పాటను విన్నారు ఆనందించారు. ఇప్పుడు ఇంకొక పాట పోస్ట్ చేస్తున్నాను ."చెలియ లేదు చెలిమి లేదు, వెలుతురే లేదు ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేలే ".ఘంటసాల - రాణి పాడారు.  


Sunday, April 15, 2012

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడి పోలేదోయ్




 దేవదాసు చిత్రం లోని "పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో" పాట పోస్ట్ చేసినందులకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నా బ్లాగ్ చూసిన వారందరికి నా కృతజ్ఞతలు.

ఇప్పుడు ఆ చిత్రంలోని ఇంకొక పాట " కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడి పోలేదోయ్ " అనే పాట పోస్ట్ చేస్తున్నాను. ఘంటసాల మాస్టారు ఎంతో భావయుక్తంగా పాడిన పాట.  అతి తక్కువ వాయిద్యాలు వాడి, పాటకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు సంగీత దర్శకులు శ్రీ సుబ్బరామన్ గారు. అంత గొప్పగా పాడారు ఘంటసాల గారు. ఈ పాటకు అర్థం అడిగితే, సముద్రాల గారు చెప్పారట: పార్వతిని కోరుకున్నాడు దేవదాసు, ఆమె దక్కలేదు, తనను కోరుకున్న చంద్రముఖిని దేవదాసు వద్దన్నాడు. మేడమీద అలపైడి బొమ్మ (పార్వతి), నీడనే చిలకమ్మా (చంద్రముఖి), చందమామ మసక వేసి పోయేముందు, కబురు ఎందుకు, కుడి యెడ మైనంత మాత్రాన, పొరపాటు కాదు, జీవితంలో ఓడి పోనక్కరలేదు. ఎంత సింబాలిక్ గా వ్రాసారు సముద్రాల గారు. అందుకే నాటికి, నేటికి ఆణిముత్యంగా నిలిచి పోయింది ఈ పాట.

Saturday, April 14, 2012

పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో

శరత్ నవల ఆధారంగా తీసిన చిత్రం "దేవదాసు". ఈ చిత్రం 26-06-1953   విడుదలై, తెలుగు చిత్ర సీమలో ఒక మైలు రాయిగా నిలిచిపోయి, అశేష ఆదరణ పొందిన చిత్రరాజం. సాంఘిక చిత్రాలలో ఒక కళాఖండం.  ఇది బెంగాలి నవల అయినా, మన తెలుగు నాట, ఈ చిత్రం ద్వారా ఆ  నవలకు విశేష ఆదరణ పొందిన మాట వాత్సవం. ఆరుగురు అతిరథ మహారథుల కృషి ఫలితమే ఈ దేవదాసు చిత్ర విజయానికి కారణం.  వారు, శ్రీయుతులు D.L నారాయణ (నిర్మాత), వేదాంతం రాఘవయ్య (దర్శకుడు), సీనియర్ సముద్రాల (పాటలు-మాటలు), సుబ్బరామన్ (సంగీత దర్శకుడు), ఘంటసాల (గాయకుడు),  అక్కినేని నాగేశ్వర రావు (కథానాయకుడు).  సావిత్రి మరపురాని నటన, B S రంగా (ఫోటోగ్రఫి) కూడా చిత్ర విజయానికి కారణం అయింది. ఈ చిత్రంలోని పాటలన్నీ ఆణిముత్యాలు. ఘంటసాల మాస్టారు ఆ పాటలకు జీవం పోసి చిరస్థాయిగా నిలిపారు. నేటికి ఆ పాటలన్నీ క్రొత్తగా ఉన్నాయి అంటే, ఆ కీర్తి శ్రీ సుబ్బరామన్, ఘంటసాల గారిదే.
పట్నంలో చదువు ముగుంచుకొని, తన చిన్న నాటి స్నేహితురాలు పార్వతి ని చూడాలని, దేవదాసు కొండంత ఆశతో తన ఊరికి వస్తూ పాడుకొనే పాట "పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో". ఘంటసాల గారి లేత గొంతులో ఈ పాట చాల చక్కాగా ఉంది. ఆ పాట వినండి. ఆనందించండి.



Wednesday, April 11, 2012

"నన్ను వదిలి నీవు పోలేవులే"

బాబు మూవీస్ (శ్రీ సుందరం నిర్మాత) నిర్మించిన చిత్రం "మంచి మనసులు" విడుదలై నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొంది. ఈ చిత్రం 11-04-1962 లో విడుదలై 23 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది. ఒక చిత్ర విజయానికి  కావలిసిన హంగులు అన్నీఉన్న చిత్రం ఇది. మంచి కథ, మంచి సంగీతం, మంచి నటన అన్నీ కలిసి చిత్ర విజయానికి దోహదం చేసాయి. ఈ చిత్రం లోని పాటలన్నీ శ్రోతల ఆదరణ పొందినవే. నన్ను వదిలి నీవు పోలేవులే, ఏవండోయ్ శ్రీవారూ, ఎంత టక్కరి వాడూ, త్యాగం ఇదియేనా, ఓహో ఓహో పావురమా, శిలలపై శిల్పాలు, మావ మావ....మావా ఇలా ప్రతి పాట గుర్తుండి పోయినవే. శ్రీ మహదేవన్ సమకూర్చిన బాణీలు అద్భుతం. ఇప్పుడు ఘంటసాల, సుశీల గారలు పడిన పాట "నన్ను వదిలి నీవు పోలేవులే" వీడియో క్లిప్పింగ్ పొందుపరుస్తున్నాను. చూడండి.గీత రచన: దాశరథి.
 

Sunday, April 8, 2012

"మనసున మనసై బ్రతుకున బ్రతుకై"

 
అన్నపూర్ణ వారి డా.చక్రవర్తి 1964 లో విడుదలైన చిత్రం. ఈ చిత్రానికి మూల కథ శ్రీమతి కోడూరి కౌసల్య దేవి నవల "చక్రబ్రమణం". ఆదుర్తి సుబ్బారావు గారి దర్సకత్వంలో రూపు దిద్దికొన్న ఈ చిత్రం బహుళ ప్రజాదరణ పొందింది. అక్కినేని, సావిత్రి, జగ్గయ్య నటనా కౌశలం, సాలూరు రాజేశ్వర్ రావు సంగీతం, కథా గమనం ఈ చిత్రానికి వన్నె తెచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డ్స్ ప్రవేశ పెట్టిన సంవత్సరం 1964 .అదే సంవత్సరినికి
  తొలి బంగారు నంది అవార్డు అందుకొన్న చిత్రం డా చర్క్రవర్తి .  అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్స్.  వీటిలో శ్రీ శ్రీ గారు వ్రాసిన "మనసున మనసై  బ్రతుకున బ్రతుకై" అన్న పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. ఘంటసాల మాస్టారు అద్భుతంగా పాడిన పాట. మనసున్న ప్రతి మనిషి కోరుకొనే పాట, వినాలనే పాట. ఆ పాట వినండి.

 

Saturday, April 7, 2012

"ఓ తారక ఓ ..ఓ జాబిలి"


 
 

భరణి స్టూడియోస్ "చండీరాణి" 18 -08 -1953 లో విడుదలైన చిత్రం. నాయికా, నాయకులుగా భానుమతి N  T రామారావు గారు నటించారు. 
 భానుమతి ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి, ఆమె దర్సకత్వం వహించారు. భారత దేశ చరిత్రలో ఒక మహిళ దర్సకత్వం వహించిన మొదటి చిత్రం "చండీరాణి". సంగీతం శ్రీ C R సుబ్బరామన్, విశ్వనాథన్/రామమూర్తి సమకూర్చారు. ఘంటసాల, భానుమతి గారలు పాడిన ఒక అద్భుత యుగళ గీతం "ఓ తారకా ఓ... ఓ జాబిలీ".  ఈ పాట వింటూ ఉంటె, మనసు అలా అలా ఆనందంతో తేలి పోతుంది. ఈ పాటలో ఘంటసాల మాస్టారు పాట ప్రారంభంలో మందస్వరంతో పలికిన "నవ్వులేల నను గని" వింటే చెప్పరాని అనుభూతి కలుగుతుంది. ఈ పాట విన్నతరువాత, మాస్టారుకు ఆ రోజుల్లో ఎంత మంది, అభిమానులు అయ్యారో చెప్పలేము.  ఆ పాట వినండి. గీత రచన సముద్రాల సీనియర్.

 

Wednesday, April 4, 2012

"కరుణశ్రీ పుష్పవిలాపం"

ఘంటసాల మాస్టారు, సినిమాలోనే కాకుండా, ప్రైవేటు సాంగ్స్ చాల పాడారు. దేశభక్తి గీతాలు, జానపద పాటలు, పుష్పవిలాపం, చివరి రోజుల్లో శ్రీ భగవత్ గీత శ్లోకాలు పాడి జీవితం ధన్యం చేసుకొన్నారు.
ఇప్పుడు, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి, విరసిత పుష్పవిలాపం, మాస్టారు ఎంత అద్బుతంగా గానం చేసారో వినండి. ఆయన గళం లోంచి, ఒక్కొక్క చరణం వింటూ ఉంటె, ఆ పూల మొక్కలే మాట్లాడి, వాటి మనోగతాన్ని చెప్పుకోన్నాయా అని అనిపిస్తుంది. అంత రసోక్తి గా, అంత మధురంగా పాడారు. వినండి. తరించండి.

 

Sunday, April 1, 2012

"పయనించే ఓ చిలుకా"(కులదైవం)

సారథి వారి "కులదైవం" 01 -01 -1960  లో విడుదలైంది. ఈ చిత్రానికి మాస్టర్ వేణు సంగీతం సమకూర్చారు. ఇందులో ఘంటసాల మాస్టారు పాడిన పాట 
"పయనించే ఓ చిలుకా" బహుళ ప్రజాదరణ పొందింది. కులదైవం మాతృక హిందీ చిత్రం "భాభి". ఇందులో మహమ్మద్ రఫీ ఇదే situation కు పాడిన "చెలె ఉడుజారే పంజి" కూడా అంతటి ప్రజాదరణ పొందినదే. భాషలు వేరైనా, చిత్రం ఒకటే. ఇద్దరు మహా గాయకులు పాడిన పాటను ఇక్కడ పొందు పరుస్తున్నాను. వినండి.