అందమే ఆనందం ..ఆనందమే జీవిత మకరందం
1953 లో విడుదలైన బ్రతుకు తెరువు చిత్రం లోని ఈ పాట నాకు మిక్కిలి ఇష్టం.
ఆ చిత్రాన్ని 1953 లో చూడక పోయినా (అప్పుడు నాకు 7 సంవత్సరాలు ) ఆ తరువాత చూసాను. చిత్రంతో పాటు, ఈ పాట నా మనస్సును ఆకట్టుకొంది.
ఘంటసాల మాస్టారు గారు, దేశ విదేశాలలో పాడినప్పుడు, ఈ పాటతోనే మొదలు పెట్టేవారని విన్నాను. ఆ పాటను, అంతటి స్థాయిలో పాడగల వారు, ఒక్క ఘంటసాల గారు తప్ప వేరెవరు లేరని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ చిత్రానికి మాస్టారు గారే సంగీతం సమ కూర్చారు. పాట రచయిత శ్రీ సముద్రాల జూనియర్.
ఈ పాటకు ఒక చరిత్ర ఉంది. ఈ పాట స్థానంలో వేరొక పాట రాసారు రచయిత. ఆ పాట దర్శకుడు శ్రీ రామకృష్ణ గారికి నచ్చలేదు. ఇంకో పాట ప్రయత్నించండి అని చెప్పారట.
రచయిత సముద్రాల జూనియర్ గారు, స్టూడియో నుండి బయటకు వచ్చారట. అది సంధ్యా సమయం. పడమట సూర్యుడు అస్తమిస్తున్నాడట. ఆ దృశ్యాన్ని చూడగానే, రచయిత మనస్సులో ఒక ఆలోచన వచ్చి పల్లవిగా "పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమ పరాగం" అని రాసుకొంటే, ఆ తరువాత చరణం తో పాటు పాటంతా ఒక వెల్లువలా వచ్చేసింది అని సగర్వంగా చెప్పుకొన్నారు.( వీడియో క్లిప్పింగ్లో, సముద్రాల జూనియర్ గారి మాటలలోనే వినండి)
మరునాడు స్టూడియోకి వెళ్లి, దర్శకుడు రామకృష్ణ గారికి, చూపితే ఓకే అనడం, మాస్టారు గారు ట్యూన్ కట్టడం, పాట రికార్డింగ్ ముగించుకొని, మాస్టారు ఇంటికి వెళ్ళితే, ఏంటి అప్పుడే వచ్చేసారు అని శ్రీమతి సావిత్రమ్మ గారు అడిగితే, పాట రాయడం, ట్యూన్ కట్టడం, ఓకే కావడం, పాట రికార్డు చేయడం అంతా జరిగిపోయింది అని సంతోషంతో చెప్పారట.ఆ పాటను మీరు కూడా విని, ఆ ఆనందాన్ని పంచుకోండి.
No comments:
Post a Comment