Tuesday, December 4, 2012

ఘంటసాల మాస్టారు గారి 90 వ జయంతి నేడు.




ఘంటసాల మాస్టారు గారి 90 వ జయంతి నేడు.
మాస్టారు కారణ జన్ములు. ఆయనకు జయంతులు, వర్ధంతులు లేవు.  ఆయన  చిరంజీవి.
ప్రతి రోజు ఆయన పాటలు నిత్యనూతనంగా వినిపిస్తూనే ఉంటాయి. ఇది మనం చేసుకొన్న పుణ్యం.
అన్ని మతాల వారు కలిసి చేసుకొనే జయంతి ఘంటసాల జయంతి. ,మాస్టారు గారు పాడిన పాటలకు కులాలు, మతాలు లేవు . ఆ పాటలు అజరామరం .
                *********************************
మాస్టారు గారికి ఒక చిరు కానుకగా ఈ కవిత సమర్పిస్తున్నాను.

                  రాగాల సరాగాల సంగీతమాల  ఘంటసాల
            కళామతల్లికి దొరికిన నిధి మన ఘంటసాల
            ఘంటసాల జీవితమే పాటల కళాశాల
            ఆ కళాశాలలో విరిసింది ఎన్నెన్నో కమ్మని పాటల సరగామాల

                    తేనె కన్నా తీయనిది ...................?
                 అమృతముకన్నా   మధురమైనది ............?
                 వసంతాన్ని మై మరుపించునది .............?
                 ఘంటసాల మాస్టారి గానామృతం కాక ఏమున్నది .
          
            పాట అయినా ,పద్యం అయినా నీకు నువ్వే సాటి
            రాలేదు, రాలేరు, రాబోరు ఎవ్వరూ నీకు సాటి 
            నీ గాత్రంలో దాగి ఉన్నాయి రాగాలు కోటి 
            మరువలేదు తెలుగు చరిత్ర  నీ పాటల సంపుటి 

                పాటలతో మమతలు నింపిన మనిషి కనుమరుగైనా ......
           ఆయన పాడిన పాటలు శ్రోతల మనసును వీడేనా ?
           అవి నిత్యమై, సత్యమై అజరామరమై .......
           వినిపిస్తూనే ఉంటాయి ఆ చంద్రార్కం, వాటికీ లేదు మరణం 
                      
                                                        కాశి రావు    ( కాశి వెంకోబ రావు)
                                                                            9885482942
          

Sunday, November 11, 2012

"నాదు ప్రేమ భాగ్య రాశి ..నీవే ప్రేయసి



భక్త జయదేవ 1961.

అక్కినేని, అంజలి దేవి, రేలంగి మొదలగు వారు నటించిన చిత్రం "భక్త జయదేవ" ఈ చిత్రం 1961 విడుదల. దర్సకత్వం శ్రీ పీ.రామారావు,  సంగీతం: శ్రీ సాలూరు రాజేశ్వర రావు. ఇది సంగీత  ప్రధానమైన చిత్రరాజం.

ఇదే చిత్రాన్ని 1938 లో కూడా తీసారు. దర్సకత్వం శ్రీ హిరెన్ బోస్.  సురభి కమలాబాయి, శాంతకుమారి, వి.వెంకటేశ్వర్లు, రెంటచింతల సత్యనారాయణ గారలు నటించగా, ఆంధ్రా సినీటోన్, విశాఖపట్నం, వారు నిర్మించారు.
ఈ చిత్రంలోని  పాటలు అందుబాటులో లేవు.

1961 లో వచ్చిన భక్త జయదేవ చిత్రంలోని పాటలు నేటికీ ప్రాచుర్యంలో ఉంది. దీనికి కారణం వాటిని ఘంటసాల మాస్టారు పాడడమే. సుశీల తో పాడిన పాట "నాదు ప్రేమ భాగ్య రాశి ..నీవే ప్రేయసి"  వినండి.                                        




 

Friday, November 9, 2012

"మది ఉయ్యాల లూగే నవ భావాలేవో రేగే"

 నరసు స్టూడియో వారు నిర్మించిన చిత్రం "భలే అమ్మాయిలు".  ఈ చిత్రం 1957 లో విడుదలైంది.  దర్సకత్వం శ్రీ వేదాంతం రాఘవయ్యగారు, సంగీతం శ్రీ సాలూరు రాజేశ్వర రావు. నటీ నటులు శ్రీ నందమూరి తారక రామ రావు , జగ్గయ్య, సావిత్రి, గిరిజ, రేలంగి, సి యస్ ఆర్.   కథా-మాటలు, పాటలు శ్రీ సదాసివ బ్రహ్మం. ఈ చిత్రం లో ఘంటసాల -లీల పాడిన యుగళ గీతం "మది ఉయ్యాల లూగే నవ భావాలేవో రేగే" మంచి  మెలోడీ పాట. "ప్రేమతో గగన సీమలలో" అని ఈ పాటను ఘంటసాల మాస్టారు  అద్భుతంగా అందుకోవడము   ఈ పాటకే కొసమెరుపు. ఆ పాట వినండి. 

 

Monday, September 24, 2012

"పయనమయే ప్రియతమా నను మరిచిపోకుమా"

అక్కినేని "ఖైస్" గా భానుమతి "లైలాగా" నటించిన చిత్రం "లైలా మజ్ను". భరణి పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం 1949 లో విడుదల. దర్సకత్వం శ్రీ రామకృష్ణ గారు, సంగీతం కీ.శే. సుబ్బరామన్. ఘంటసాల గారు పాడిన "పయనమయే ప్రియతమా నను మరిచిపోకుమా"         
 ఒక మంచి గుర్తుండి పోయిన పాట. రచన శ్రీ సముద్రాల ?
ఆ పాట విందాము.


Thursday, September 20, 2012

"మాణిక్య వీణా ముపలాల యంతి" (మహాకవి కాళిదాస్)

నేడు శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారి జన్మ దినోత్సవం. ఆయన 89 వ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు.
ANR ఈ మూడు అక్షరాలు తెలుగు కళామ తల్లికి దొరికిన ఆణిముత్యాలు. అందం, నటన, రాజసం కలబోసిన వ్యక్తిత్వం అక్కినేని సొంతం. ఆ నటునికి శుభాకాంక్షలు. అక్కినేని నటించిన "మహాకవి కాళిదాస్" లో ఘంటసాల గారి స్వరంలో "మాణిక్య వీణా ముపలాల యంతి" విందాము. ఘంటసాల గారు అద్భుతంగా గానం చేసారు. సంగీతం శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు. ఈ చిత్రం 1960 లో వచ్చింది. దర్సకత్వం శ్రీ కమలాకర కామేశ్వర రావు.



Monday, September 17, 2012

" ఓ పోయే పోయే చినదాన నీ కమ్మని మనసు నాదేనా"





Uyyala Jampala

శ్రీ కే.బి.తిలక్  నిర్మించి దర్సకత్వం వహించిన చిత్రం "ఉయ్యాలా జంపాల". ఈ చిత్రం 1965 లో విడుదలైంది. శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు గారు అద్భతమైన బాణీలు సమకూర్చి అన్ని పాటలు సూపర్ హిట్ చేసారు. ఈ చిత్రంలోని ఘంటసాల మాస్టారు పాడిన " ఓ పోయే పోయే చినదాన నీ కమ్మని మనసు నాదేనా" మంచి మెలోడి పాట. గీత రచన ఆరుద్ర గారు. ఆ పాట విందాము.

 

Monday, August 6, 2012

"మది శారదా దేవి మందిరమే"



శారదా ప్రొడక్షన్స్ వారి "జయభేరి" 9-4-1959 లో విడుదలైన  చిత్రం. ఇది ముఖ్యంగా సంగీత ప్రాధాన్యత గల చిత్రం. ఈ చిత్రానికి శ్రీ పి.పుల్లయ్య దర్సకత్వం వహించగా శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు అద్భుతమైన సంగీతం సమకూర్చి అన్ని పాటలు సూపర్ హిట్ చేసారు. ఈ చిత్రంలో అన్ని క్లాసికల్ పాటలే. ఘంటసాల, పీ.బీ.శ్రీనివాస్, పాణిగ్రాహీ    గానం చేసిన, "మది శారదా దేవి మందిరమే" ఒక గొప్ప క్లాస్సికాల్  పాట. ఘంటసాల మాస్టారు అద్భుతంగా గానం చేసారు. గీత రచన శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. కళ్యాణి రాగం లో స్వర పరచిన పాట.