Tuesday, January 31, 2012

andame aanandam from Brathuku Theruvu





అందమే ఆనందం ..ఆనందమే జీవిత మకరందం
1953 లో విడుదలైన బ్రతుకు తెరువు చిత్రం లోని ఈ పాట నాకు మిక్కిలి ఇష్టం.
ఆ చిత్రాన్ని 1953 లో చూడక పోయినా  (అప్పుడు నాకు 7 సంవత్సరాలు ) ఆ తరువాత చూసాను. చిత్రంతో  పాటు, ఈ పాట నా మనస్సును ఆకట్టుకొంది.
ఘంటసాల మాస్టారు గారు, దేశ విదేశాలలో పాడినప్పుడు, ఈ పాటతోనే మొదలు పెట్టేవారని విన్నాను.  ఆ పాటను, అంతటి స్థాయిలో పాడగల వారు, ఒక్క ఘంటసాల గారు తప్ప వేరెవరు లేరని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ చిత్రానికి మాస్టారు గారే సంగీతం సమ కూర్చారు. పాట రచయిత శ్రీ సముద్రాల జూనియర్.

ఈ పాటకు ఒక చరిత్ర ఉంది. ఈ పాట స్థానంలో వేరొక పాట రాసారు రచయిత. ఆ పాట దర్శకుడు శ్రీ రామకృష్ణ గారికి నచ్చలేదు. ఇంకో పాట ప్రయత్నించండి అని చెప్పారట.

రచయిత సముద్రాల జూనియర్ గారు, స్టూడియో నుండి బయటకు వచ్చారట. అది సంధ్యా సమయం. పడమట సూర్యుడు అస్తమిస్తున్నాడట. ఆ దృశ్యాన్ని చూడగానే, రచయిత  మనస్సులో ఒక ఆలోచన వచ్చి పల్లవిగా "పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమ పరాగం" అని రాసుకొంటే, ఆ తరువాత చరణం తో పాటు పాటంతా ఒక వెల్లువలా వచ్చేసింది  అని సగర్వంగా చెప్పుకొన్నారు.( వీడియో క్లిప్పింగ్లో, సముద్రాల జూనియర్ గారి మాటలలోనే  వినండి)
మరునాడు స్టూడియోకి వెళ్లి, దర్శకుడు రామకృష్ణ గారికి, చూపితే  ఓకే అనడం, మాస్టారు గారు ట్యూన్ కట్టడం, పాట రికార్డింగ్ ముగించుకొని, మాస్టారు ఇంటికి  వెళ్ళితే, ఏంటి అప్పుడే వచ్చేసారు  అని శ్రీమతి సావిత్రమ్మ గారు అడిగితే, పాట రాయడం, ట్యూన్ కట్టడం, ఓకే కావడం, పాట రికార్డు చేయడం అంతా జరిగిపోయింది  అని సంతోషంతో చెప్పారట.
ఆ పాటను మీరు కూడా విని, ఆ ఆనందాన్ని పంచుకోండి.

Friday, January 27, 2012

oho megha mala-bhale ramudu

భలే రాముడు చిత్రం 1956 లో విడుదల అయ్యింది. నాకు అప్పుడు 10 సంవత్సరాలు. మా నాన్న ఉద్యోగ్య రీత్యా, కర్నూల్ లో ఉన్నాము. నేను 6th క్లాసు లో ఉన్నాను. ఈ చిత్రం, కర్నూల్ టౌన్, సాయిబాబా హాల్ లో రిలీజ్ అయినట్లు నాకు బాగా గుర్తు. నేను మొదటి సారి ఈ సినిమా చూసి నప్పుడే, ఇందులోని పాట "ఓహో మేఘమాలా", నాకు బాగా నచ్చింది. అప్పట్లో, పాట వినాలంటే మళ్ళి,  సినిమా చూడాల్సిందే కదా. అలా ఆ పాటకోసం, నేను ఆ సినీమాని, 10 సార్లు చూసాను. ఇప్పటికి ఆ పాటను రోజుకు ఒక సారైనా వినందే, అదో వెలితిగా ఉంటుంది.
తరాలు మారినా అంతరాలు మారని పాటగా,  శాశ్వతంగా, ఘంటసాల అబిమానుల గుండెలో నిలిచిపోయిన ఆణిముత్యం ఈ పాట. శ్రీ సదాశివబ్రహ్మం కలం, శ్రీ సాలూరి రాజేశ్వర్ రావు స్వరం, ఘంటసాల మాస్టారు గళం, ఈ పాటకు వన్నె తెచ్చాయి.  మీరు వినండి, ఆనందించండి, మేఘాలలో విహరించండి. ప్రేమోతో ..వెంకోబ రావు కాశి.  



Tuesday, January 24, 2012

ghantasala ganam

శ్రీ ఘంటసాల మాస్టారు నా ఆరాధ్య  దైవం. దాదాపు  55 సంవత్సరాలుగా  ఆయన పాటలు వింటూ ఆనందిస్తున్నాను. ఆ పాటల మహిమ వల్ల నాకు ఏ రోగాలు రాలేదు/లేదు  నాకు  66 వయస్సు వచ్హినా, మనసు ఉల్లాసంగా/నేను ఆరోగ్యంగా   ఉండడానికి కారణం మాస్టారు పాటలే అంటే అతిశయోక్తి  కాదు. ఆయన మీద ఉన్నఅభిమానంతో ఈ బ్లాగ్ మొదలుపెట్టి, నా తొలి ప్రయత్నంగా ఒక కవిత వ్రాసి సమర్పిస్తున్నాను. ఆదరించ గలరు. ఈ బ్లాగ్ ఏర్పాటుకు  తన వంతు సలహా సహకారం అందించిన శ్రీ సూర్యనారాయణ వులిమిరి, మోరిసవిల్, నార్త్ కెరొలిన   గారికి నా కృతజ్ఞతలు.
      

                             రాగాల ......సరాగాల....గానమాల.. ఘంటసాల
                             సప్త స్వరాల...... కళాశాల ఘంటసాల 
                             తెలుగు కళామ తల్లికి లబించిన గాన  గంధర్వుడు  ఘంటసాల          
                             పాటలకు ప్రాణం పోసిన  అమరగాయకుడు   ఘంటసాల              

                             ఏడు స్వరాలను ఏడు లోకాలకు వినిపించిన అమరగాయకుడు ఘంటసాల
                            ఆయన పాడిన పాటలు నిత్యము, సత్యము, నిరంతరం
                            ఆ పాటలకు లేదు మరణం............. అవి ....అజరామరం
                            తరాలు మారినా అంతరాలు మారని పాటలు పాడిన గానగంధర్వుథు ఘంటసాల
                                  
                   
                           శ్రీ తిరుమల  వేంకటేశ్వర సమ స్థానం,              
                           గానగంధర్వ   ఘంటసాల గానామృతం 
                           న...... భూతో......... న......... భవిష్యతి  
                            న...... భూతో......... న......... భవిష్యతి    

వెంకోబ రావు కాశి
క్యాంపు  అట్లాంటా